Rahul Gandhi blamed AAP for Congress’ defeat in Gujarat elections: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కారణం అని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ పార్టీకి బీ-టీమ్ గా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి ఆప్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని అన్నారు. ఆప్ పార్టీ లేకపోతే గుజరాత్ లో బీజేపీని ఓడించే వాళ్లమని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు కలిసి గుజరాత్ లో ఆప్ ను అడ్డుకున్నాయని.. గుజరాత్ లో ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తామని అన్నారు.
Read Also: Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాషాయ బికినీ ఫోటో వైరల్..
బీజేపీ దేశాన్ని విభజించేందుకు, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీని ఓడించాలనే దృక్ఫథమే లేదని అన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటమి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ఓటమిలో ఆప్ పెద్ద పాత్రను పోషించిందని అన్నారు. ఆప్ వెళ్లిన ప్రతీ చోట అబద్ధం చెబుతోందని.. గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ కు విరాళాలు ఇచ్చే వారిని బెదిరించడం వల్ల బీజేపీ లబ్ధిపొందుతోందని.. ఎలక్టోరల్ బాండ్లు పెద్ద కుంభకోణం అని అశోక్ గెహ్లాట్ అన్నారు.
బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని ఆప్ చెబుతోంది. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాల్లో బీజేపీ, 17 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో ఆప్ గెలుపొందింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో 37 ఏళ్ల క్రితం 1985లో కాంగ్రెస్ పేరిట ఉన్న 149 స్థానాల్లో గెలుపు రికార్డును బీజేపీ బద్ధలుకొట్టింది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 17 స్థానాలకు పడిపోయింది.