Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఈ విషయానికి సంబంధించి, రాధికా ప్రాణ స్నేహితురాలు హిమాన్షికా సింగ్ సంచలన విషయాలు బయటపెట్టింది. తన స్నేహితురాలు రాధిక తన కుటుంబం నుంచి అన్ని విషయాల్లో సమస్యల్ని ఎదుర్కొందని, ఆమె తన ఇంట్లోనే ఉక్కిరిబిక్కిరికి గురైందని చెప్పింది.
2012 నుంచి హిమాన్షిక, రాధికకు పరిచయం ఉంది. రాధిక తరుచుగా షార్ట్ ధరించడం, అబ్బాయిలతో మాట్లాడటం, ఆమె సొంత నిర్ణయాల ప్రకారం జీవించడాన్ని ఆమె తండ్రి ఓర్చుకోలేదని ఆమె చెప్పింది. రాధికను కఠినంగా నియంత్రించాలని భావించాడని, బయటకు వెళ్లి రావడానికి నిర్ణీత సమయాన్ని కూడా ఫిక్స్ చేసేవాడని ఆమె చెప్పింది.
Read Also: Maharashtra: అమానుషం.. మరాఠీ మాట్లాడలేదని ఆటో డ్రైవర్‌పై దాడి
‘‘రాధికా నాతో కాల్‌లో ఉన్నప్పుడు కూడా, ఆమె ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చేది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరం ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు నిర్ణీత గడువులోగానే తిరిగి రావాలనే కఠినమైన నిబంధనలు పెట్టేవారు’’ అని హిమాన్షికా పేర్కొంది. రాధిక కుటుంబం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదని, దాంతో ప్రతీదానితోనూ ఆమెకు సమస్య ఉండేది అని ఆమె చెప్పింది.
నియంత్రణ, నిరంతర విమర్శలతో రాధిక తండ్రి ఆమె జీవితాన్ని దుర్భరంగా మార్చాడని విమర్శించింది. ‘‘అతను తన నియంత్రణ ప్రవర్తన, నిరంతర విమర్శలతో ఆమె జీవితాన్ని గందరగోళ పరిచాడు, అబ్బాయితో మాట్లాడినందుకు ఆమెను అవమానించాడు’’ అని రాధిక తండ్రిపై హిమాన్షిక ఆరోపణలు చేసింది. తన స్నేహితురాలు రాధిక మంచి ఆత్మీయురాలు, అమాయకురాలు అని గుర్తు చేసుకుంది. రాధిక వీడియోలు చేయడం, ఫోటోలు తీయడం ఇష్టపడుతుందని చెప్పింది. క్రమంగా ఆమె అభిరుచులు, ఆసక్తులు అన్నీ కనుమరుగయ్యాని చెప్పింది. ఆమె ఇంట్లో ఎన్నో ఆంక్షలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.