Radhika Khera: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌కి చెందిన కీలక నేత రాధికా ఖేరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించినప్పటి నుంచి పార్టీలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఈ విషయాన్ని అగ్రనాయకులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సాయం చేయలేదని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్‌పర్సన్ సుశీల్ ఆనంద్‌తో పాటు మరికొంత మంది తనను అనుకోని పదజాలంలో దుర్భాషలాడినట్లు ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
Read Also: Rain forecast: బెంగళూరు ప్రజలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ..
ఇదిలా ఉంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తర్వాత ఈ రోజు బీజేపీలో చేరారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న ఖేరా మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ హిందూ వ్యతిరేఖమని ఆరోపిస్తూ, తనకు కాషాయ పార్టీ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామభక్తుడినైనందుకు, రామ్ లల్లాని దర్శనం చేసుకున్నందుక తనపై అనుచితంగా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ గాంధీ కాలం నాటిది కాదని, అది రాముడికి వ్యతిరేకంగా ఉందని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీని రాధికా ఖేరా అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ముందు కీలకమైన నేత ఇలా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి పంపింది. పార్టీలో గౌరవం లేదని, ముఖ్యంగా మహిళా నాయకులను అవమానిస్తున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అవమానాలపై సీనియర్ నేతలు భూపేష్ బాఘేల్, పవన్ ఖేరా, సచిన్ పైలట్‌లకు సమాచారం అందించామని, అయితే ఎవరూ తనకు సహాయం చేయలేదని ఆమె ఆరోపించారు.