Punjab woman accuses Pak embassy staff: పాకిస్తాన్ ఎంబసీ సిబ్బంది ఓ మహిళ ప్రొఫెసర్ తో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక కోరికల గురించి అడుగుతూ తిక్క ప్రశ్నలు వేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించింది. తన వీసా అపాయింట్మెంట్ కోసం పాక్ ఎంబీసీ వెళ్లినప్పడు సీనియర్ సిబ్బంది తప్పుగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ కూడా రాశారు ఆమె. చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..
ఇండియా పంజాబ్ కు చెందిన మహిళ పాకిస్తాన్ పర్యటన కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీని కలిసిన సమయంలో ఈ ఘటన జరిగింది. తాను పాకిస్తాన్ హైకమిషన్‌తో ఆన్‌లైన్ వీసా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ ఎందుకు పర్యటించాలని ప్రశ్నించినప్పుడు.. లాహోర్ లోని స్మారక చిహ్నాలను చిత్రీకరించి వాటిపై రాయాలని అనుకుంటున్నట్లు మహిళ ఎంబసీ అధికారులకు చెప్పింది. అక్కడే ఓ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్తున్నట్లు తెలిపింది.
అయితే ఆమె వెళ్తున్న సమయంలో మరో సిబ్బంది వచ్చి..ఎందుకు పెళ్లి చేసుకోలేదు, లైంగిక కోరికలపై ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా లేఖ రాశారు. ఆమె పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందితో వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌లను కూడా విదేశాంగ మంత్రికి పంపింది. ఇదే సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయమని అడిగారని.. అందుకు మంచి డబ్బును కూడా ఆఫర్ చేశారని.. అందుకు తాను అంగీకరించలేదని మహిళ వెల్లడించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతు ఇస్తారా..? అని ఎంబసీ సిబ్బంది ప్రశ్నించినట్లు తెలిపారు.