త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానికి బీజేపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు మినహా అసెంబ్లీలోని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రసంగించారు. దేశ యువతకు అగ్నిపథ్ వ్యతిరేకమని ఆయన అన్నారు. త్వరలో అగ్నిపథ్ పథకంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో చర్చిస్తామన్నారు.
అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత ప్రతాప్ బజ్వా డిమాండ్ చేశారు.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి తాము సైతం బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు అకాలీదళ్ నేత మన్‌ప్రీత్ సింగ్ అయాలీ ప్రకటించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనేక చోట్ల నిరసనకారులు రైళ్లు తగలబెట్టారు. ఈ ఘటనల్లో కొంత మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి