Birthday Wishes: రాజకీయాల్లో ఉన్నవారే సిద్ధాంతాల పరంగా వేరు భావజాలంతో ఉంటునప్పటికీ వారికి సంబంధించిన కుటుంబ, వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తుంటారు. ఒక పార్టీలో ఉండే వారు మరొక పార్టీ నాయకుల ఇళ్లల్లో జరిగే శుభ కార్యాలకు హాజరవుతారు. ఒకరికొకరు పుట్టిన రోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కారణం రాజకీయాలు వేరు.. వ్యక్తిగతంగా ఉండటం వేరు. రాజకీయంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ మానవ సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి సందర్భమే ఇది.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 16న కేజ్రీవాల్ పుట్టిన రోజు కావడంతో ప్రధాని మోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ రోజు 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ట్విట్టర్ వేదిక ప్రధాని మోడీ బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘‘ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Read also: Charan: రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే కూడా అయిపోయాయి… అప్డేట్ ఇస్తారా లేదా?
కొద్ది రోజుల క్రితం ముగిసిన వర్షాకాల పార్లమెంటు సమావేశాలో్ల ఢిల్లీ ఆర్డినెన్స్ ను కాస్త బీజేపీ చట్టంగా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సర్వీసెస్ చట్టం కారణంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఆర్డినెన్స్ వచ్చిన దగ్గరి నుంచి కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ప్రధాని మోడీ టార్గెట్‌గా కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. అయినప్పటికీ అవి రాజకీయ పరంగా ఉండే సమస్యలు కాబట్టి వాటిని పక్కన బెట్టి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల్లో ఢిల్లీ శాసన సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి వాదోపవాదాలు, చర్చలు జరిగే అవకాశం ఉంటుంది.