PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాది మంది మద్దతుదారులు, బీజేపీ, జేడీయూ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ నేతన రవి శంకర్ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక వాహనంపై ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. ప్రధానిని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు.
Read Also: Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు
40 లోక్‌సభ స్థానాలు ఉన్న బీహార్ ఎన్డీయే కూటమికి కీలకంగా మారింది. గతంలో 2019 ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఏకంగా 39 స్థానాలను గెలుచుకుంది. ఈ సారి కూడా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ 19న మొదటిదశలో ఔరంగాబాద్, గయా, జముయి మరియు నవాడ అనే నాలుగు నియోజకవర్గాలలో 49.26 శాతం ఓటింగ్ నమోదైంది. రెండవ దశలో, ఏప్రిల్ 26న 59.45 శాతం ఓటింగ్‌తో బంకా, భాగల్‌పూర్, కతిహార్, కిషన్‌గంజ్ మరియు పూర్నియా అనే ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మే 7న జరిగిన మూడో దశ ఝంజర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా మరియు ఖగారియా ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 58.18 శాతం ఓటింగ్ నమోదైంది. మే 13న జరిగే నాలుగో విడతలో రాష్ట్రంలోని 5 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు ఈసారి ఇండియా కూటమిలో భాగంగా ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 26 చోట్ల ఆర్జేడీ పోటీ చేస్తుండగా, మిగతా చోట్ల కాంగ్రెస్, లెఫ్ట్ పోటీ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.