PM Modi: హమాస్ పొలిటకల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. దాడిపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆందోళన తెలియజేశారు. తాను ఈ విషయమై ఖతాన్ ఎమిర్‌తో మాట్లాడానని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించానని, వివాదాలు పరిష్కరించుకోవడానికి చర్చించుకోవాలని పిలుపునిచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు.
Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!
“ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో మాట్లాడి దోహాలో జరిగిన దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోదర దేశమైన ఖతార్ యొక్క సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని భారతదేశం ఖండిస్తోంది” అని ప్రధాని ట్వీట్ చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రధాని నొక్కిచెప్పారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా సంయమనం పాటించాలని కోరారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నొక్కిచెబుతూనే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన మద్దతు ఇస్తుందని అన్నారు.
ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్‌లో కనీసం ఐదుగురు మరణించారు. వీరిలో హమాస్ ముఖ్యనేతలకు సంబంధించి ముగ్గురు బాడీ గార్డులు ఉన్నారు. ఖలీల్ అల్ హయ్యా కుమారుడు హమ్మమ్ అల్ హయ్యా, అతడి కార్యాలయ నిర్వాహకుడు జిహాద్ లాబాద్ ఇద్దరు మరణించినట్లు హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సుహైల్ అల్ హిందీ తెలిపారు. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. కాల్పుల విరమణ, బందీల విడుదలలో ఖతార్ మధ్యవర్తిత్వ పాత్రను ప్రధాని ప్రస్తావించారు.