చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ రాజ్య జీవితా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను మోడీ ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్సింగ్‌లో దాదాపు 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Azerbaijan: మా మద్దతు పాకిస్థాన్‌కే.. భారత్‌పై అజర్‌బైజాన్ అధ్యక్షుడు విమర్శలు
తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ ఉపయోగించిన వ్యాఖ్యలు.. ‘‘నా తల్లినే కాదు.. దేశంలో ఉన్న ప్రతి తల్లిని.. సోదరిని అవమానించారు.’’ అని తెలిపారు. తన తల్లిని గురించి మాట్లాడిన మాటలు వింటే.. తనలాగే మీరు కూడా బాధపడతారని తనకు తెలుసు అన్నారు. కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి హీరాబెన్ ఎంతో కష్టపడిందని గుర్తుచేశారు. తనను, తన తోబుట్టువులందరినీ పెంచడానికి పేదిరకంతో పోరాడిందని జ్ఞాపకం చేశారు. తన తల్లి ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేదని.. అయినా కుటుంబ పోషణ కొరకు నిత్యం పని చేస్తూనే ఉండేదని పేర్కొన్నారు. మా బట్టల కోసం ప్రతి పైసాను ఆదా చేసేదన్నారు. దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారని చెప్పారు. దేవతల కంటే తల్లి స్థానం గొప్పదని కొనియాడారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్‌లపై మోడీ ధ్వజం
రాజకుటుంబంలో జన్మించిన యువరాజులు పేద తల్లి బాధను.. ఆమె కొడుకు పోరాటాలను అర్థం చేసుకోరన్నారు. వాళ్లంతా బంగారం, వెండి చెంచాతో జన్మించారని.. మళ్లీ రాజరికం కోసమే బీహార్‌లో అధికారం కోరుతున్నారని విమర్శించారు. మీరంతా పేద తల్లిని, కొడుకును ఆశీర్వదించి ప్రధాన సేవకునిగా చేశారని మోడీ పేర్కొన్నారు. మహిళా వ్యవస్థాపకులకు సులభంగా నిధులు అందించడానికే బీహార్ రాజ్య జీవితా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను ప్రారంభించినట్లు మోడీ తెలిపారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్త.. మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది. బీజేపీ అగ్ర నేతలంతా ఖండించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పాట్నాలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు.