Madhya Pradesh: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. వావీ వరసలు, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కామాంధులు మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చాలా వరకు అత్యాచార కేసుల్లో హత్యలు జరుగుతున్నాయి.
Read Also: Turkey Earthquake: టర్కీకి సాయం చేసిన ఆర్మేనియా.. ఈ సాయం ఎందుకంత ప్రత్యేకమో తెలుసా..?
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కరేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లి గుడిలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి తీసుకెళ్లింది. అయితే ఆ సమయంలో బాలిక, తల్లి నుంచి విడిపోయింది. బాలిక ఇంటికి వెళ్లి ఉంటుందని తల్లి భావించింది. ఇంటికి వెళ్లి చూడగా కూతురు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శనివారం ఉదయం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక బాలిక మృతదేహం కనిపించింది. బాలిక అరవకుండా నోటిలో గుడ్డలు పెట్టి అత్యాచారానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దురాగతానికి పాల్పడిని వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చందేల్ నిందితుడి సమాచారం తెలిపితే రూ.10,000 ఇస్తామని రివార్డ్ ప్రకటించారు. పోక్సో, అత్యాచారం, హత్య నేరాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.