NIA conducts raids at multiple locations in Bihar: బీహార్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఇటీవల బీహార్ పోలీసులు పాట్నా ఉగ్ర కుట్రను ఛేదించారు. ఈ కేసుపై ఎన్ఐఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్న కొంతమంది ఇళ్లపై దాడులు నిర్వహించారు. బీహార్ దర్భంగాలోని ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నూరుద్దీన్, సనావుల్లా, ముస్తకీమ్ ఇళ్లపై దాడులు చేసింది ఎన్ఐఏ. ఈ ముగ్గురు కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లో కీలక సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం ముగ్గురు అనుమానితుల్లో నూరుద్దీన్ ను ఇటీవల లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పాట్నా జైలులో ఉన్నాడు. మిగతా ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ఇటు ఎన్ఐఏ, బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. గురువారం ఈ ముగ్గురి గ్రామాల్లో ఎన్ఐఏ మూడు టీంలు సోదాలు నిర్వహించాయి. కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగిన మూడు ప్రాంతాల్లోని ప్రజలు సోషల్ డెమెక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కి మద్దతుదారులుగా ఉన్నారు. ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉందనే అనుమానంతో కొంతమంది వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Honey-Trap: పాకిస్తాన్ వలపు వలలో ఆర్మీ జవాన్.. అరెస్ట్
పుల్వారీ షరీఫ్ కేసుగా ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో భాగంగా బుధవారం ఎన్ఐఏ చంపారన్ జిల్లాలోని ఓ మసీదులో సోదాలు నిర్వహించింది. ఓ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుంది. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 26 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. బీహార్ పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీని చంపాలనే కుట్రను చేయడంతో పాటు 2047 వరకు భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే పత్రాలను ఇటీవల బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ కుట్రను బయటపెట్టారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.