Gurpatwant Singh Pannun: కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్‌గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు నిల్చుని మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే కెనడా, అమెరికా, యూకేల్లో భారతీయ దౌత్యవేత్తలను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్ల వెనక తన హస్తం ఉన్నట్లు పన్నూ స్పష్టం చేశాడు. ఇటీవల కెనడాలో చంపబడిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తన సోదరుడని.. ఆయనతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ చనిపోవడానికి అమెరికా, కెనడాల్లోని భారతీయ దౌత్యవేత్తలే కారణం అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు. జూలై 5న షూట్ చేసిన వీడియో అని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. న్యూయార్క్ లో యూఎన్ కార్యాలయం ముందు నిలబడి.. ఓదో రోజు ఖలిస్తాన్ జెండా ఇక్కడ ఎగురుతుందని అనడం వీడియోలో చూడవచ్చు.
Read Also: Delhi: ఢిల్లీలో ఓ మహిళ మూడేళ్లపాటు 14కుక్కలను ప్లాట్లో బంధించి ఘోరం
యూఎస్, కెనడాల్లో భారతీయ దౌత్యవేత్తలను టార్గెట్ చేస్తూ ఇటీవల ‘కిల్లర్ పోస్టర్లు’ వెలిశాయి. దీని వెనక పన్నూ హస్తం ఉంది. కెనడాల్లోని సర్రె నగరంలో గురుద్వారా ముందు కాల్చి చంపబడిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి కెనడాలోని దౌత్యవేత్తలు సంధువర్మ దొరైస్వామీ, మల్హోత్రా వోహ్రాను బాధ్యులు చేస్తామని పన్నూ హెచ్చరించాడు.
వరసగా ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అనుమానస్పద రీతిలో చనిపోవడంతో గత 45 రోజుల నుంచి పన్నూ అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. కెనడాలో మూడోదశ ఖలిస్తాన్ రిఫరెండం ఓటింగ్ ప్రారంభించాడు. దీని కోసం టొరంటో, వాంకోవర్, ఒట్టవా నగరాల్లో ర్యాలీలకు పిలుపునిచ్చాడు. ఈ చర్యపై భారత్ కెనడాకు తన అభ్యంతరాన్ని చెప్పింది. ఇలాగే ఖలిస్తానీలపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తే.. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయిన ఘాటుగా హెచ్చరించింది.