Pakistan: పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. నిలువెల్లా భారత్ వ్యతిరేకతక ప్రదర్శించే ఆ దేశం రామ మందిర ప్రారంభోత్సవంపై అసూయ పడుతోంది. అయోధ్యలో రామ మందిర ఓపెనింగ్ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్(ట్విట్టర్)లో కీలక ప్రకటన చేసింది. ‘‘భారత్‌లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో ‘రామ మందిరం’ నిర్మించడాన్ని పాకిస్తాన్ ఖండిస్తోందని’’ ట్వీట్ చేసింది.
Read Also: Himanta Biswa Sarma: “ఈ రోజు కూడా రావణుడి గురించే మాట్లాడాలా..?” రాహుల్ గాంధీపై అస్సాం సీఎం..
మసీదు స్థలంలో నిర్మించిన దేవాలయం రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగులుతుందని, ముఖ్యంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహి ఈద్గా మసీదుతో సహా మసీదుల జాబితా పెరుగుతోందని, ఇది అపవిత్రత, విధ్వంసం అంటూ తన ప్రకటనలో ప్రేలాపనలు చేసింది. ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవం గత 31 ఏళ్లుగా భారత్‌లో పెరుగుతున్న మెజారిటీవాదాన్ని సూచిస్తుందని, భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో దిగజార్చే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది. ముస్లింలు, వారి పవిత్ర స్థాలాల్లో మతపరమైన మైనారిటీల భద్రతను నిర్థారించాలని పాకిస్తాన్ భారత్ ప్రభుత్వాన్ని కోరింది.
అయితే, మైనారిటీల అణిచివేతతో ముందున్న పాకిస్తాన్, భారత్‌కి నీతి సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉంది. పాక్‌లోని హిందువులు, క్రిస్టియన్స్, అహ్మదీలపై దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాప్, బలవంతపు మతమార్పిడి, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించకుండా, భారత అంతర్గత విషయాల్లో వేలు పెడుతోంది.