Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ అస్సాంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వసర్మ, రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అస్సాంలోని పవిత్ర బటద్రవా ధామ్ వెళ్లాలని రాహుల్ గాంధీ భావించినప్పటికీ.. భద్రత కారణాల దృష్ట్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు అస్సాం సీఎం దేశంలోనే అవినీతి సీఎం అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also: Ram Temple Inauguration: రామ మందిర ప్రారంభోత్సవం.. బిడ్డకు ‘రామ్ రహీమ్’ పేరు పెట్టిన ముస్లిం మహిళ..
ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం హిమంత, రాహుల్ గాంధీని రాక్షస రాజు రావణుడితో పోల్చారు. రామాలయ వేడుకకు రాహుల్ గాంధీని ఎందుకు ఆహ్వానించలేదని విలేకరి ప్రశ్నించగా.. ‘‘రావణుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు..? కనీసం ఈ రోజైన రాముడి గురించి మాట్లాడాలి’’ అని వ్యాఖ్యానించారు. 500 ఏళ్ల తర్వాత రాముడి గురించి మాట్లాడటానికి ఈ రోజు మంచి రోజు. ఈ రోజు రావణుడి గురించి మాట్లాడొద్దని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. అయితే వీటిని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలా ఉందని విమర్శించింది. అందుకే ఈ వేడులకు వెళ్లడం లేదని చెప్పింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.