World Cup 2023: క్రికెట్ ఫ్యాన్ రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ చూసేందుకు వీవీఐపీలు వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ మ్యాచ్‌కి హాజరుకాబోతున్నారు. వీరే కాకుండా సినీ ప్రముఖులు, స్పోర్ట్స్ సెలబ్రెటీలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మెతేరాలోని స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్), హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. లక్ష మంది అభిమానులు, ప్రముఖుల రాకతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ మెగా ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా 6000 మందికి పైగా పోలీస్ భద్రత సిబ్బంది మోహరించారని, 6000 మంది సిబ్బందిలో 3000 మంది స్టేడియం లోపల మోహరిస్తారని తెలిపారు. మరికొందరిని ఆటగాళ్లు, ప్రముఖులు ఉన్న హోటళ్ల వంటి కీలక ప్రదేశాల్లో సెక్యురిటీగా ఉంచుతామని మాలిక్ చెప్పారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఉగ్రవాదం, నేరాలే..
ఆర్ఏఎఫ్ ఒక కంపెనీ స్టేడియం లోపల మోహరించబడుతుందని, మరొకటి స్టేడియం వెలుపల విధుల్లో ఉంటుందని, నగర పోలీసలుు వేదిక లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది మొబైల్ కమ్యూనికేషన్ విఫలమైనా.. వైర్‌లెస్ నెట్వర్క్ తో పనిచేస్తుందని అన్నారు.
ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమీషనర్లు(డీసీపీ) ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని, వీరికి 39 మంది అసిస్టెంట్ల కమీషనర్లు, 92 మంది సీఐలు విధుల్లో పాల్గొంటారని జీఎస్ మాలిక్ తెలిపారు. మ్యాచ్‌లో ఏదైనా జీవరసాయన, న్యూక్లియర్ అత్యవసర పరిస్థితులపై స్పందించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలను కూడా నగరంలో మోహరించినట్లు అహ్మదాబాద్ పోలీస్ చీఫ్ చెప్పారు.
బాంబ్ డిటెక్షన్ మరియు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్‌ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. మేమే ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, కెనడా లేదా వేరే దేశంలో కూర్చున్న వారు బెదిరింపు ఈ మెయిల్స్, ఆడియోలు, వీడియోలు పంపుతారని మీడియా వీటిని హైప్ చేస్తుందని, అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం లేదని కమీషనర్ మాలిక్ అన్నారు.
రేపటి మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, సింగపూర్ హోం మంత్రి కే షణ్ముగం, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, అస్సాం సీఎం హిమంతబిశ్వ సర్మ, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా హాజరవ్వనున్నారు. 1.32 లక్షల సామర్థ్యం గల స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.