OpenAI: రేపటితో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు తెరపడబోతోంది. మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. తాజాగా ఓ బాంబులాంటి వార్త బయటకు వచ్చింది. భారతదేశ ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు, యాంటీ-బీజేపీ ఎజెండాతో కృత్రిమమేథ(AI)ని ఉపయోగించేందుకు ఇజ్రాయిల్‌కి చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని ఓపెన్ఏఐ(OpenAI) నివేదిక పేర్కొంది. ఈ కోవర్ట్ ఆపరేషన్‌ని అడ్డుకున్నట్లు ఓపెన్ఏఐ వెల్లడించింది. ఇజ్రాయిల్ ఆధారిత నెట్వర్క్ ‘‘భారతదేశం దృష్టిసారించే వ్యాఖ్యల్ని సృష్టించడం ప్రారంభించిందని, అధికార బిజెపి పార్టీని విమర్శించింది మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రశంసించింది’’ అని నివేదిక పేర్కొంది.
READ ALSO: Bhavani Revanna: హెచ్‌డీ రేవణ్ణ భార్యకు లభించని ఊరట.. కిడ్నాప్ కేసులో నో బెయిల్
ఈ నెట్వర్క్ ఇజ్రాయెల్‌లోని రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ STOIC ద్వారా నిర్వహించబడుతుందని నివేదిక పేర్కొంది. ప్రజాభిప్రాయాలను మార్చేందుకు లేదా రాజకీయ ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించే కార్యకలాపాల కోసం AIని ఉపయోగించిందని నివేదిక వెల్లడించింది. రహస్య కార్యకలాపాల కోసం కంటెంట్‌ను రూపొందించడానికి మరియు సవరించడానికి ఇజ్రాయెల్ నుండి నిర్వహించబడుతున్న ఖాతాల క్లస్టర్ ఉపయోగించబడిందని తెలిపింది. ఈ కంటెంట్ ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వెబ్‌సైట్స్, యూట్యూబ్‌కి షేర్ చేయబడింది. మే ప్రారంభంలో ఈ నెట్వర్క్ ఇంగ్లీష్ కంటెంట్‌తో ఇండియా ప్రజల్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించినట్లు నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ..‘‘ కొన్ని భారతీయ రాజకీయ పార్టీల తరుపున తప్పుడు సమాచారం, విదేశీ జోక్యం జరిగింది. వీరికి బీజేపీ లక్ష్యంగా ఉందనేది స్పష్టమైంది’’ అని అన్నారు. భారతదేశం వెలుపల ఉన్న స్వార్థ ప్రయోజనాలే దీనిని నడిపిస్తున్నాయని, దీనిపై లోతుగా పరిశోధన చేయడం అవసరమని అన్నారు.