దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లినా బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. భుజ్ శివారులో జరిగిన ఈ ఘటన మార్చి 16న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని సమీపంలోని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను హుస్సేన్ కాకల్ (35), రాహుల్ సత్వారా (19), వల్జీ వదిరియా (24), మహేష్ (20)గా గుర్తించినట్లు కచ్ ఎస్పీ సౌరభ్ సింగ్ వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ప్రతాప్‌గఢ్ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ తన భర్తతో కలిసి రైలుకోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఆమె భర్త టీ కోసం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి పార్కింగ్ ప్రాంతంలో స్వచ్ఛమైన టాయిలెట్ ఉందని నమ్మించి మహిళను అక్కడకు వెళ్లమని చెప్పాడు. మహిళ ఆ గదిలోకి వెళ్లగానే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.