26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేము. ఈరోజునే దేశంలో భయంకరమైన ఉగ్రదాడి జరిగింది’’ అని అన్నారు.
ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిందరికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. దేశం అమరవీరులైన వీర జవాన్లను స్మరించుకుంటోందని అన్నారు. ముంబై, దేశం మొత్తం ఉగ్రదాడుల కారణంగా వణికిపోయిందని, ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి భారత్ తన సామర్థ్యాన్ని ఉపయోగింకుందని, ఇప్పుడు ఉగ్రవాదాన్ని అణిచివేసే ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. 26/11 దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. దాడికి ప్రణాళిక, అమలు చేసిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలనే భారత్ తపన మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
ముంబైలో 2008లో ఇదే రోజున భారీ ఉగ్రదాడి జరిగింది. 10 మంది ఉగ్రవాదులు ఆర్థిక రాజధానితో పాటు దేశాన్ని వణికించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబై చేరుకుని మారణహోమానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో 166 మందిని చంపారు. 300 మంది ఈ దాడుల్లో గాయపడ్డారు.
ఐకానిక్ తాజ్ మరియు ఒబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్‌లను లక్ష్యంగా చేసుకుని వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిలీలు, భారతీయులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు 9 మంది ఉగ్రవాదుల్ని హతమార్చగా.. కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. 2010లో ఇతని భారత్ ఉరితీసింది.