Opposition Meeting: విపక్షాల ఐక్యతపై ఈ నెల 23న పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 17 పార్టీలు సమావేశమయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు ఐక్యంగా పోటీ చేయాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలు వచ్చే సమావేశంలో నిర్ణయించబడతాయని విపక్షాలు పేర్కొన్నాయి.
ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే నెల రెండో వారంలో సిమ్లా వేదికగా విపక్షాల సమావేశం జరుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. అయితే ఈ వేదిక ఇప్పుడు బెంగళూర్ కు మారింది. జూలై 13-14 తేదీల్లో బెంగళూర్ వేదికగా ప్రతిపక్ష పార్టీ నేతల తదుపరి సమావేశం నిర్వహించబోతున్నట్లు ఎన్సీపీ నేత శరద్ పవార్ గురువారం తెలిపారు.
Read Also: Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?
గతంలో జూన్ 23న జరిగిన సమావేశంలో కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్టీ ఖండించి, ఆప్ కు మద్దతు తెలిపే వరకు భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కూడిన ప్రతిపక్ష సమావేశాల్లో తాము పాల్గొనబోమని ఆప్ తెలిపింది. అయితే ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చర్చించలేదని పవార్ ఇటీవల తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్ తో, హేమంత్ సొరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశాన్ని ఫోటో సెషన్ గా అమిత్ షా అభివర్ణించారు. కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఓడించలేదని బహిరంగంగా ఒప్పుకుందని స్మృతి ఇరానీ విమర్శించారు. అసలు ప్రధాని అభ్యర్థి ఎవరనేది ముందు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.