Worst Traffic: భారతదేశ నగరాల్లో ఇటీవల కాలంలో ట్రాఫిక్ కష్టాలు పెరగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ నివేదిక ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాను వెల్లడించింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాల్లోని 387 నగరాలను, వాటి సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, CO2 ఉద్గారాలను అంచనా వేసి ఈ జాబితాను రూపొందించింది. 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌ల డేటా ఆధారంగా రూపొందించబడింది.
Read Also: Trinadha Rao Nakkina : నిర్మాతగా కొత్త బ్యానర్ స్థాపించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ..
2023లో అధ్వానమైన ట్రాఫిక్ పరిస్థితులు ఉన్న నగరాల జాబితాలో టాప్-10లో ఇండియాలోని బెంగళూర్(6), పూణే(7) నగరాలు ఉన్నాయి. బెంగళూరులో, 2023లో 10 కి.మీకి సగటు ప్రయాణ సమయం 28 నిమిషాల 10 సెకన్లు కాగా, పూణేలో ఇది 27 నిమిషాల 50 సెకన్లు అని టామ్‌టామ్ నివేదిక తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 27న బెంగళూర్లో సగటున 10కి. మీ ప్రయాణించేందుకు 32 నిమిషాలు పట్టింది. ఢిల్లీ 44వ స్థానంలో, ముంబై 52వ స్థానంలో ఉంది. ఢిల్లీలో సగటున 2023లో 10 కిలోమీటర్లు నడపడానికి 21 నిమిషాల 40 సెకన్లు పట్టిందని, ముంబైలో 21 నిమిషాల 20 సెకన్లు పట్టిందని నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. యూకే రాజధాని లండన్, ఐర్లాండ్ రాజధాని డబ్లిన్, కెనడా నగరం టొరంటోలు అత్యంత చెత్త ట్రాఫిక్ కలిగిన టాప్-3 నగరాలుగా ఉన్నాయి. 2023లో 10 కి.మీ. ప్రయాణానికి లండన్‌లో 37 నిమిషాలు, డబ్లిన్ లో 29 నిమిషాల 30 సెకన్లు, టొరంటోలో 29 నిమిషాలు పట్టినట్లు నివేదిక తెలిపింది.
ప్రపంచంలో చెత్త ట్రాఫిక్ ఉన్న టాప్-10 నగరాలు
1) లండన్
2) డబ్లిన్
3) టొరంటో
4) మిలాన్
5) లిమా
6) బెంగళూర్
7) పూణే
8) బుచారెస్ట్
9) మనీలా
10) బ్రస్సెల్స్