SCO Summit: భారతదేశం ఉగ్రవాదంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశంలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకపోవడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. అయితే, పాకిస్తాన్ మరియు చైనాలు బలూచిస్తాన్ అంశాన్ని మాత్రం ప్రస్తావించాయి. బలూచిస్తాన్‌లో భారత్ అశాంతిని సృష్టిస్తోందని పరోక్షంగా ఆరోపించింది. పాకిస్తాన్‌కి అనుకూలంగా చైనా పహల్గామ్ అంశాన్ని ఉమ్మడి ప్రకటన నుంచి మినహాయించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం, ఎస్‌సీఓ అధ్యక్ష పదవిలో చైనా ఉండటంతో ఈ రెండు దేశాలు కలిసి పహల్గామ్ అంశాన్ని ప్రస్తావించలేదు. మరోవైపు, పాకిస్తాన్‌కి అనుకూలంగా బలూచిస్తాన్ అంశాన్ని లేవనెత్తింది.
Read Also: DBS Bank: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. మినిమం బ్యాలెన్స్ రూ. 10000 లేకపోతే భారీగా ఫైన్
బలూచిస్తాన్ లో భారత్ ప్రమేయంతోనే అశాంతి ఏర్పడుతోందని పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ పదేపదే తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఇలాంటి ఆరోపణలు చేయడానికి బదులుగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడ మానేయాలని చెప్పింది. “ఉమ్మడి ప్రకటణ భాషతో భారతదేశం సంతృప్తి చెందలేదు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించబడలేదు, పాకిస్తాన్‌లో జరిగిన సంఘటనల గురించి ప్రస్తావించబడింది, కాబట్టి భారతదేశం ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించింది. ఉమ్మడి ప్రకటన కూడా లేదు” అని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్ సింగ్ చైనాలోని కింగ్‌డావో వెళ్లారు. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను చర్చించడానికి రష్యా, పాకిస్తాన్, చైనాతో సహా సభ్యదేశాలు ఈ సమావేశాలకు హాజరయ్యాయి. 2001లో స్థాపించబడిన SCO, సహకారం ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కూటమిలో ప్రస్తుతం బెలారస్, చైనా, భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్- మొత్తం 10 సభ్యదేశాలు ఉన్నాయి.