S Jaishankar: న్యూఢిల్లీలో సంప్రదింపులు లేకుండా ప్రస్తుతం ప్రపంచం ఏ సమస్యపై నిర్ణయం తీసుకోలేదని, భారత్ ప్రపంచంలో చాలా కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ మారిందని, ప్రపంచం మనల్ని చూసే దృష్టి కూడా మారిందని ఆయన శనివారం అన్నారు. భారత్ స్వతంత్రంగా ఉండటమే దీనికి కారణమని.. భారత్ వేరొకరి సంస్థలా కాకుండా, తన ప్రయోజనాల కోసం పరస్పరం విభిన్న దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.
‘‘ఈ రోజు చాలా దేశాలు మన శక్తిని, ప్రభావాన్ని గుర్తించాయి. మనం 10 ఏళ్ల క్రితం 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము, ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. మరికొన్ని ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాము. ప్రపంచంలో ఏ సమస్య కూడా భారత్‌తో సంప్రదింపులు లేకుండా నిర్ణయించబడదు. మనం మారాము, మన గురించి ప్రపంచ దృక్ఫథం మారింది’’ అని జైశంకర్ అన్నారు. ప్రధాని మోడీ అమృత్ కాల్ గురించి మాట్లాడుతూ.. ఈ 10 ఏళ్లను పునాదిగా భావించండి, వచ్చే 28 ఏళ్లు భవనాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. విరుద్ధ ప్రయోజనాలు కలిగిన దేశాలతో కూడిన క్వాడ్, బ్రిక్స్‌లో భారత్ ఎలా భాగంగా ఉంటుందని అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఇలా సమాధానం ఇచ్చారు.
Read Also: Maldives Row: “మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదు”.. మాల్దీవ్స్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
‘‘మనం కనీసం 5000 ఏళ్ల నాగరికత, అత్యధిక జనాభా కలిగిన నాగరికత, భౌతికంగా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన స్వభావం స్వతంత్రంగా ఉండటం. మనం స్వతంత్రంగా ఉండటంతో వేర్వేరు వ్యక్తులతో ఎలా వ్యవహరించడం ద్వారా మన ప్రయోజనాల ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి’’ అని ఆయన అన్నారు. ‘‘10 ఏళ్ల క్రితం మూడు, నాలుగు మెట్రో వ్యవస్థలున్న దేశంలో నేడు దాదాపు 20 ఉన్నాయి. గత పదేళ్లుగా ఈ దేశంలో ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు తెరుచుకుంటున్నాయి.. భారతీయులందరికీ ప్రపంచం ఎంతో దూరంలో లేదు. ఇది మన వద్దకు వచ్చింది. ప్రపంచం మన వద్దకు రావడానికి కోవిడ్ ఒక సంకేతం’’ అని ఆయన అన్నారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాలతో క్వాడ్ ఏర్పడింది. ఇదే సమయంలో భారత్ చైనా, రష్యాలు భాగస్వాములుగా ఉన్న బ్రిక్స్‌లో కూడా భాగంగా ఉంది. BRICS అనేది 10 దేశాల సమూహం – బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి.