PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
ముంబాయిలో 9/11, అమెరికాలో 26/11 దాడులు తర్వాత, రాడికలిజం, ఉగ్రవాదం ఇప్పటికీ ప్రపంచం మొత్తానికి ప్రమాదంగా మిగిలిందని అన్నారు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే, ఎగుమతి చేసే దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అదే విధంగా చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ యూఎన్ చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఏ విధంగానైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది యుద్ధాల యుగం కాదని మరోసారి ప్రధాని పునరుద్ఘాటించారు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో పలుసార్లు మాట్లాడారు, ఈ సందర్భంగా చర్చలు మరియు దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఆహారం, ఇంధన భద్రత, సప్లై చైన్ తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది పలు దేశాలు చెబుతున్నాయి.