Bihar: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వమైన మహాఘటబంధన్‌కి తెరపడింది. మరోసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, తన పాత మిత్రుడు బీజేపీతో కలిసి అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు జనవరి 28న జేడీయూ-బీజేపీల ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ బీహార్ సీఎం, సోషలిస్ట్ నేత కర్పూరీ ఠాకూర్‌కి భారతరత్న ఇవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారాయి. దీనిపై సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, నితీష్‌ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్స్ చేయడంతో ఈ వివాదం కాస్త పెద్దదైంది. దీంతో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీకి, జేడీయూకి చెడింది.
Read Also: Putin Praises PM Modi: ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు.. ఏమన్నారంటే..
ఇదిలా ఉంటే మరోసారి బీజేపీ సాయంతో నితీష్ కుమార్ సీఎంగా పదవీస్వీకారం చేయనున్నారు. జనవరి 28న ఇందుకు ముహూర్త ఫిక్స్ అయినట్లు, నితీష్‌కి డిప్యూటీగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీహార్ బీజేపీ యూనిట్ అధిష్టానంతో మంతనాలు చేస్తో్ంది. నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరికపై మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమచారం. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమి ముఖ్య నేతల్లో ఒకరైన నితీష్ కుమార్ బీజేపీ వైపు రావడం ఆ కూటమికి భారీ దెబ్బగా చెప్పవచ్చు.