Nitish Kumar, Lalu Yadav To Meet Sonia Gandhi: 2024 లోకసభ ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు ఈ సారి ప్రతిపక్షాల సిద్ధం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ఏర్పడిన విధంగానే జాతీయ స్థాయిలో కూడా మహాకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. బీహార్ రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ కలిసి మహకూటమిని ఏర్పాటు చేసి మరోసారి సీఎం అయ్యారు నితీష్ కుమార్. కాంగ్రెస్ తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అధికారాన్ని పంచుకుంటోంది.
ఇదిలా ఉంటే ఈ ఆదివారం సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నట్లు సమాచారం. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నితీష్ కుమార్, సోనియా గాంధీని కలవనున్నారు. 2015లో బీహార్ ఎన్నికల ముందు జరిగిన ఇఫ్లార్ విందులో సోనియాగాంధీని కలిశారు నితీష్.
Read Also: jeevitha rajasekhar: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ
జాతీయ స్థాయిలో బీజేపీ కూటమికి చెక్ పెట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్. బీహర్ లో బీజేపీని వదిలి ఆర్జేడీతో జట్టుకట్టి అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో పర్యటించారు నితీష్ కుమార్. ఈ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వామపక్ష నేతలను కలిశారు. వీరందరితో 2024 సాధారణ ఎన్నికలపై చర్చించారు.
మరోవైపు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీజేపీ టార్గెట్ గా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడి ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న లాలూకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే వారంలో కిడ్నీ మార్పిడి కోసం ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.