Hyderabad: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్‌తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుతారని నేతలు ఆరోపిస్తున్నారు. మెరుగైన జనాభా నియంత్రణ చర్యల్ని అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గిందని వారు చెబుతున్నారు.
Read Also: Delimitation Row: వైఫల్యాలను కప్పిపుచ్చడానికే స్టాలిన్ వ్యూహం.. బీజేపీ విమర్శలు..
ఇదెలా ఉంటే తదుపరి, రెండో డీలిమిటేషన్ సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని స్టాలిన్ ప్రకటించారు. హైదరాబాద్ సమావేశం తర్వాత ఇక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామని స్టాలిన్ చెప్పారు. శనివారం చెన్నైలో జరిగిన మొదటి సమావేశంలో, డీలిమిటేషన్‌పై న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రతిపాదించారు. అదే సమయంలో న్యాయమైన డీలిమిటేషన్ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకుందామని పిలుపునిచ్చారు.