Bengaluru: బెంగళూర్ నగర ఓటర్లు బద్ధకించారు. శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికల ప్రక్రియలో నగర ఓటర్లు అనాసక్తి ప్రదర్శించారు. సగం మంది బెంగళూర్ ఓటర్లు వేటేయడానికి రాలేదు. కర్ణాటకలోని 14 ఎంపీ స్థానాలకు నిన్న ఎన్నికలు జరగగా 69.23 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం చెప్పింది. అయితే, నగరంలోని మూడు అర్బన్ నియోజకవర్గాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. బెంగళూర్ సౌత్, బెంగళూర్ సెంట్రల్, బెంగళూర్ నార్త్ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యావంతులు ఎక్కువగా ఉండే బెంగళూర్ వంటి నగరంలో ఇలా పోలింగ్‌కి దూరంగా ఉండటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Read Also: Sukumar : సుహాస్ ను నానితో పోల్చిన సుకుమార్.. ఆ ఒక్క మాటతో ఫిదా..
బెంగళూరు సెంట్రల్‌లో సుమారుగా 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌లో 54.32 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.76 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.70 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఓటర్లు పోలింగ్ బూతులకు రాకపోవడానికి ఎండల వేడి కూడా కారణమే అని పోలింగ్ అధికారులు తెలిపుతున్నారు. ఇదిలా ఉంటే బెంగళూర్ రూరల్‌లో మాత్రం 67.29 శాతం ఓటింగ్ నమోదైంది. మాండ్యాలో 81.48, కోలార్‌లో 78.07 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూర్ వంటి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెంచేందుకు ఈసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. వివిధ యాప్‌లను ఉపయోగించేలా ప్రజల్ని ప్రోత్సహించడంతో పాటు పోలింగ్ బూత్‌లని గుర్తించడానికి ఓటర్ స్లిప్‌లపై QR కోడ్‌లని ఉంచింది. ఓటరు హెల్ప్‌లైన్, ‘నో యువర్ క్యాండిడేట్’ మరియు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య మరియు పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉన్న పార్కింగ్ సౌకర్యాల గురించి వివరాలను అప్డేట్ చేయడం వంటి అనేక సౌకర్యాలను తీసుకువచ్చింది. అయినా కూడా పోలింగ్ శాతం పెరగడకపోవడంతో ఈసీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.