Indian Navy: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఈ రోజు త్రివిధ దళాల అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత అరేబియన్ సముద్రంలో భారత నేవీని మోహరించినట్లు వెల్లడించారు. కరాచీతో సహా సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేందుకు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు నేవీ వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు. ‘‘”మనం ఎంచుకున్న సమయంలో కరాచీతో సహా సముద్రంలో, భూమిపై ఎంపిక చేసిన లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సంసిద్ధత, సామర్థ్యంతో అరేబియన్ సముద్రంలో మా దళాలు ముందుకు మోహరించబడ్డాయి’’ అని ఆపరేషన్ సిందూర్ త్రివధ దళాల సంయుక్త సమావేశంలో చెప్పారు.
Read Also: India Pakistan War: ఎయిర్ బేస్‌లపై దాడితో పాకిస్తాన్లో భయం.. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
ఆపరేషన్ సిందూర్‌తో ఆర్మీ, వైమానిక దళం గగనతలం, నేలపై నుంచి ఖచ్చితమైన దాడులు చేయడం ప్రారంభించాయని, నేవీ కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పారు. ఇండియన్ నేవీ మోహరించడంతో పాకిస్తాన్ రక్షణాత్మక వైఖరితో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ సమయంలో అరేబియా సముద్రంలో నావికా దళం మోహరించడంతో పాక్ నేవీ దాదాపుగా ఒడరేవు లేదా తీరానికి సమీపంలో ఉండాల్సి వచ్చిందని చెప్పారు.
పహల్గామ్ దాడి జరిగిన వెంటనే నేవీ తన యుద్ధ బృందాలు, జలంతర్గాముల్ని, నేవీ నౌకల్ని మోహరించినట్లు చెప్పారు. పూర్తి పోరాట సంసిద్ధతతో మోహరించామని వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు. ఉగ్రవాద దాడులు జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో వ్యూహాలతో మోహరించినట్లు చెప్పారు. ఎంచుకున్న లక్ష్యాలపై దాడుల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. భారత్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ కైనెటిక్ చర్యల వల్లే పాకిస్తాన్ కాల్పుల విరమణను అభ్యర్థించిందని ఆయన చెప్పారు.