Devendra Fadnavis: భారతదేశంలోని ముస్లింలు ఎవరూ ఔరంగజేబ్ కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలు ఎవరూ కూడా మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా గుర్తించరని మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగబాద్ లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన చర్యను ఆమోదించారా..? అని ప్రశ్నించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్ధవ్ ఠాక్రే, అంబేద్కర్ పొత్తు పెట్టుకున్నారు.
ఔరంగేజేబును పొడుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో ఇటీవల మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయంలో ప్రకాష్ అంబేద్కర్, జౌరంగజేబు సమాధిని సందర్శించారు. ఔరంగజేబు మన నాయకుడు ఎలా అవుతాడు? మన రాజు ఒక్కడే, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా అంగీకరించరని, అతని వారసులు దేశం బయట ఉన్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలు ఔరంగజేబును ఆమోదించరని, శివాజీనే తమ నాయకుడిగా గుర్తిస్తారని అన్నారు.
Read Also: North Korea: నార్త్ కొరియా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది.. అధికారులకు మూడింది..
ఔరంగజేబు మన దేశాన్ని చాలా కాలం పాలించారని అంబేద్కర్ అన్నారు.. అయితే హిట్లర్ కూడా జర్మనీని చాలా కాలం పాలించాడు, ఆయన కూడా దేవుడు అవుతాడా.. అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాష్ అంబేద్కర్ తో పొత్తు పెట్టుకున్నాడు.. ఇప్పుడు ఆయన చర్యలను ఠాక్రే అంగీకరిస్తున్నారా..? అని అడిగారు. అంతకుముందు కొల్హాపూర్ పట్టణంలో ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టులో పెట్టడంతో హిందువులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులే ఇలాంటి పనులు చేస్తారని ఆరోపించారు.
గతంలో ఎన్సీపీతో చేతులు కలిపితే పార్టీ మూసేస్తానన్న బాల్ ఠాక్రే వ్యాఖ్యలను ఫడ్నవీస్ గుర్తు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్సీపీ-కాంగ్రెస్ తో చేతులు కలిపారని, ఆ సమయం మళ్లీ వస్తానని నేను చెప్పానని, మళ్లీ రావడమే కాదు ఏక్ నాథ్ షిండేను సీఎంగా తీసుకువచ్చానని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన భావజాలాన్ని పక్కన పెట్టి ప్రధాని మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.