భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈరోజు భారతీయుల కల నెరవేరిన రోజు అని పేర్కొన్నారు. రామ మందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. ఈరోజు వారి ఆత్మలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, వీహెచ్‌పీ నేత దాల్మియా, అనేక మంది సాధువులు, ప్రజలు, విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఈ నిర్మాణం కోసం ఎంతో మంది ఆశతో ఎదురుచూశారని.. వారి సంకల్పం నేటితో నెరవేరిందని చెప్పుకొచ్చారు. ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును వ్యాపింపజేసిన రామరాజ్య ‘ధ్వజం’ ఇప్పుడు శిఖరంపై కూర్చుందని తెలిపారు. ధ్వజం అనేది ఒక చిహ్నం అని చెప్పారు. 500 సంవత్సరాల కల ఇన్నాళ్లకు నెరవేరిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi-Ayodhya: ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు పోయాయి
ఇక ధ్వజారోహణ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ హాజరయ్యారు.
అంతకముందు అయోధ్య శ్రీరామ్‌లల్లా ఆలయంలో జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.
‘‘ధ్వజ్ ఆరోహణ్’’ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ‘ఓం’ చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచారు.