అయోధ్య రామమందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈరోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామమందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి భక్తుడికి నివాళులు అర్పిస్తున్నానన్నారు.
ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందని.. నేడు నిలబెట్టిన ధర్మ ధ్వజము.. పేదరికం, బాధలు లేని సమాజాన్ని నిర్మించడానికి.. వివక్షతను వదిలించుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ కాషాయ జెండా హిందూ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని.. అంతేకాకుండా సంవత్సరాల గాయం కూడా మానిపోతుందని పేర్కొన్నారు.
ఈరోజు దేశం, ప్రపంచం మొత్తం రామనామస్మరణతో మార్మోగుతుందని తెలిపారు. ప్రతి రామ భక్తుని హృదయం సంతోషంగా ఉందని చెప్పారు. శతాబ్దాల బాధ తొలగడంతో భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 500 సంత్సరాలుగా వెలుగుతున్న ఆ త్యాగానికి నేటితో పరిపూర్ణత వచ్చిందని చెప్పుకొచ్చారు.
దేశం పురోగతి సాధించాలంటే.. మన గుర్తింపు గురించి మనం గర్వపడాలన్నారు. మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మన మనస్సులో ముద్రించిన బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలని కోరారు. మనకు స్వేచ్ఛ లభించింది కానీ న్యూనతా భావాల నుంచి కాదన్నారు.
అంతకముందు అయోధ్య శ్రీరామ్‌లల్లా ఆలయంలో జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.
‘‘ధ్వజ్ ఆరోహణ్’’ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ‘ఓం’ చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచారు.