India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగుతూనే ఉంది. ఇటీవల భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలు 41 మందిని స్వదేశానికి రప్పించుకోవాలని ఆ దేశాని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 10లోగా వారంతా వెళ్లాలని, ఆ తరువాత దేశంలో ఉంటే దౌత్యవేత్తలకు ఇస్తున్న ప్రత్యేక సదుపాయాలను కట్ చేస్తామని చెప్పింది.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26 వేల మంది మిస్సింగ్..
కెనడా దౌత్యపరమైన ఉనికి భారత్ లో ఎక్కువగా ఉందని, రెండు దేశాలు సమానత్వం సాధించడంపై చర్చిస్తున్నాయంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. భారత అంతర్గత విషయాల్లో కెనడా జోక్యం ఉన్నందున, వారి దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ కోరిందని ఆయన గురువారం చెప్పారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రే నగరంలో కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఒక్కసారిగా మొదలైంది. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరించగా.. భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను భారత్ వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. కెనడా చేస్తున్న ఆరోపణల్ని భారత్ అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించడమే కాకుండా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.