Matrimonial fraud: ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు ఉంటే, ఇప్పుడు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు తమకు నచ్చిన సంబంధాలను మ్యాట్రిమోని సైట్లలో వెతుక్కుంటున్నారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. తాజాగా రాజస్థాన్‌కి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఒకర్నికాదు ఇద్దర్ని కాదు ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మ్యాట్రిమోనియల్ సైట్‌లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 250 మందికి పైగా మహిళలతో స్నేహం చేసి మోసం చేసిన 45 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నరేష్ పూజారి గోస్వామిగా గుర్తించారు. గత 20 ఏళ్లుగా అతనున బెంగళూర్ నగరంలో నివసిస్తున్నాడు. మాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లలో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి మహిళలు, వారి కుటుంబాల నుంచి డబ్బులు కొల్లగొట్టేవాడు. నిందితుడు యువకుల ఫోటోలను ఉపయోగించి ఆన్లైన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కస్టమ్స్ ఆఫీసర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పోజులిచ్చేవాడని పోలీసులు తెలిపారు.
Read Also: Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో చిక్కుకుపోయిన 20 మంది భారతీయులు..
నిందితుడు 10 రాష్ట్రాల్లోని మొత్తం 259 మంది మహిళల్ని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారిగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఫోజుల ఇచ్చి, పెళ్లి కోసం యువతుల కుటుంబాలను బెంగళూర్‌కి ఆహ్వానించేవాడు. ఆ తర్వాత నిందితుడు తనకు ఆఫీసులో అర్జంట్ పని ఉందని, మిమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు తమ మామ వస్తాడని, తనే వెళ్లి వారిని కలిసేవాడు. అలా కలిసిన తర్వాత, వారికి కొంతదూరం వెళ్లి మళ్లీ ఫోన్ చేసి, తన మామకు రూ. 5000-10,000 ఇవ్వాలని, తన కుటుంబం కోసం అత్యవసరంగా రైల్వే టికెట్స్ బుక్ చేయాలని, తాము కలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడని నమ్మబలికే వాడు. యువకుడిగా, అతని మామగా రెండు క్యారెక్టర్లను పోషించే వాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యేవాడు.
కోయంబత్తూర్‌కి చెందిన బాధితురాలు ఫిబ్రవరి 23 ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గోస్వామి విడాకులు తీసుకున్న, వితంతువులను లక్ష్యంగా చేసుకునే వాడని పోలీసులు తెలిపారు. బెంగళూర్‌కి రమ్మని చెప్పే సమయానికి మహిళలతో అర్థరాత్రి వరకు మాట్లాడుతూ వారి నమ్మకాన్ని చోరగొనే వాడని తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది బాధితుల స్టేట్మెంట్స్ రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీలోని మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.