Delhi deputy CM Manish Sisodia made sensational comments against BJP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1 నిందితుడి.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారం బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మనీష్ సిసోడియా ఏ1 అయినప్పటికీ ఇందులో ప్రధాన పాత్ర సీఎం కేజ్రీవాల్ దే అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే కేజ్రీవాల్ కు పెరుగుతున్న పాపులారిటీని ఓర్వలేకే కేంద్రం ఈడీ, సీబీఐలను వినియోగించి దాడులు చేయిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. రానున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకే ఇలా బీజేపీ చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆప్ పార్టీ నుంచి వైదొలిగితే అన్ని కేసులను మూసేస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని సోమవారం వెల్లడించారు. బీజేపీలో చేరితే ఈడీ, సీబీఐ కేసులు ఎత్తేస్తామని నాకు బీజేపీ ఆఫర్ చేసిందని.. తనపై కేసులన్నీ అవాస్తమని.. మీరు ఏంచేయాలనుకుంటే అది చేయండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు సిసోడియా. ‘‘బిజెపికి నా సమాధానం — నేను మహారాణా ప్రతాప్ మరియు రాజ్‌పుత్ వారసుడను. నేను తల నరికివేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కుట్రదారులు మరియు అవినీతిపరుల ముందు ఎన్నటికీ తలవంచలేను. నాపై ఉన్న కేసులన్నీ అబద్ధం. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి.’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Icon Star: జాతీయ జెండా… తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్!
మనీష్ సిసోడియా ఆరోపణలను బీజేపీ నేత మనోజ్ తివారీ తిప్పికొట్టారు. కేసుల్లో చిక్కుకోవడంతోనే సిసోడియా ఇలా కట్టుకథలు అల్లుతున్నాడని వ్యాఖ్యానించారు. మహారాణా ప్రతాప్ తో పోల్చుకోవడం సిగ్గు చేటని అన్నారు. మహారాణా ప్రతాప్ ప్రజలతో మద్యం తాగించాడా..? అని ప్రశ్నించారు. మీరు ఢిల్లీ ప్రతీ మూలలో మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. మీరు ఢిల్లీలో మహిళల ఆర్తనాదాలను విస్మరిస్తున్నారని.. మహారాణా ప్రతాప్ ఒకప్పుడు మహిళల కోసం ఆయుధాలు పట్టాడని మనీష్ తివారీ అన్నారు.
ఈ వివాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ద్రవ్యోల్భనం ఆకాశాన్ని అంటుతుంటే.. రూపాయి విలువ పడిపోతుంటే.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని.. ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆయన అన్నారు.