Maldives: మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తమ టికెట్స్, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
తాజాగా మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆ దేశానికి వెళ్తున్న భారత పర్యాటకుల్లో గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం తగ్గింది. మార్చి 2023లో, 41,000 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారని, మార్చి 2024లో ఆ సంఖ్య కేవలం 27,224కి పడిపోయిందని, 33 శాతం క్షీణతను చూపుతుందని నివేదిక తెలిపింది. మార్చి 2023 వరకు, మార్కెట్‌లో 10 శాతం వాటాతో మాల్దీవులకు భారతదేశం రెండో అతిపెద్ద పర్యాటక వనరుగా ఉంటే, ప్రస్తుతం ఆరు శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది.
Read Also: Sardar Ramesh Singh Arora: పాకిస్తాన్ చరిత్రలోనే తొలి సిక్కు మంత్రిగా సర్దార్ రమేష్ సింగ్ అరోరా..
భారత పర్యాటకులు తగ్గుతుంటే, మరోవైపు చైనా నుంచి పర్యాటకుల సంఖ్య అకాస్మాత్తుగా పెరిగింది. మాల్దీవులు-చైనా సంబంధాలు బలపడుతున్న వేళ 2024లో ఆ దేశానికి 54000 చైనా పర్యాటకులు వెళ్లారు. చైనా ప్రస్తుతం టూరిస్టుల లిస్టులో టాప్‌లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవులకు మొత్తం 2,17,394 మంది పర్యాటకులు వస్తే, వీరిలో 34,600 మంది చైనీయులు ఉన్నారు. 2021, 2022, 2023లో మాల్దీవులకు వెళ్లిన టూరిస్టుల్లో భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఏడాదికి 2 లక్షల కంటే ఎక్కువ మంది ఆ దేశానికి వెళ్లారు.
ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇండియా వ్యతిరేక విధానాలను అవలంభిస్తు్న్నాడు. ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికుల్ని వెంటనే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన పోస్టులు చేసిన వారం రోజులకే ముయిజ్జూ చైనాను సందర్శించాడు. ఈ దేశంలో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. చైనా నుంచి ఎక్కువ పర్యాటకులను తమ దేశానికి పంపాలని అతను కోరాడు.