Sardar Ramesh Singh Arora: ముస్లిం రిపబ్లిక్‌గా ఉన్న పాకిస్తాన్ దేశంలో ఒక హిందూ, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీలు అత్యున్నత పదవులను ఆక్రమించడం చాలా అరుదు. తాజాగా సర్దార్ రమేష్ సింగ్ అరోరా అనే వ్యక్తి పాకిస్తాన్ దేశంలోనే తొలి సిక్కు మంత్రిగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రావిన్స్‌లో మైనారిటీ వ్యవహాల మంత్రిగా పనిచేయనున్నారు. రమేష్ సింగ్ అరోరా పాకిస్తాన్ మైనారిటీ నాయకుల్లో శక్తివంతమైన నేతగా ఉన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) పార్టీకి చెందిన అరోరా ఫిబ్రవరి 8 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడవసారి లాహోర్ ప్రావిన్స్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Read Also: Butter chicken: “బటర్ చికెన్” వ్యక్తి ప్రాణం తీసింది..
49 ఏళ్ల అరోరా ఇటీవల పాకిస్థాన్ గురుద్వారా పర్బంధక్ కమిటీకి పర్ధాన్ (అధ్యక్షుడు)గా ఎన్నికయ్యారు. కర్తార్‌పూర్ కారిడార్‌కి అంబాసిడర్‌గా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా మహిళ ప్రమాణస్వీకారం చేశారు. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ పంజాబ్ సీఎంగా ఉన్నారు. అరోరాకు పాకిస్తాన్ ఆర్మీతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 11, 1974న నరోవల్ జిల్లా నన్కానా సాహిబ్‌లో అరోరా జన్మించారు. 2013లో పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీకి తొలి సిక్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో మైనారిటీ జాతీయ కమిషన్ సభ్యుడు, కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ‘ది పంజాబ్ సిఖ్ ఆనంద్ కరాజ్ మ్యారేజ్ యాక్ట్-2018’ చట్టం తీసుకురావడానికి కృషి చేశాడు. సిక్కు వివాహాల నమోదు చట్టం అమలులోకి వచ్చిన మొదటిదేశంగా పాకిస్తాన్ నిలిచింది. 2016లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా మానవహక్కుల అవార్డును అందుకున్నారు.