మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని చెబుతున్నారు. వీరంతా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే రహస్యంగా సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని.. మీ మనోభావాలను గౌరవిస్తానని సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రెబెల్ ఎమ్మెల్యేలను కోరుతున్నారు.
ఈ సమయంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ ప్రముఖలతో చర్చల అనంతరం ముంబై వచ్చిన ఫడ్నవీస్ నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. 39 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని.. శివసేన ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని.. బలాన్ని నిరూపించుకునేందుకు ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశాలు ఇవ్వాలని ఫడ్నవీస్, గవర్నర్ ను కోరారు. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేలా గవర్నర్ కు లేఖ ఇచ్చినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
ఫడ్నవీస్, గవర్నర్ ను కలిసిన తర్వాత అటు గౌహతిలో రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తో పాటు ప్రవీణ్ దరికర్ లు ఫడ్నవీస్ తో చర్చలు జరిపారు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 144 మ్యాజిక్ ఫిగర్. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కలిపి 152 ఎమ్మెల్యేల మెజారిటీ ఉండేది. అయితే ఇప్పుడు 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు 7 మంది స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 106 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.