మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న (బుధవారం) జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. అయితే వారం మధ్యలో (బుధవారం) పోలింగ్ ఎందుకు పెట్టారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం నిర్వహించడానికి కారణముందని చెప్పారు. పట్టణ ఓటర్లను చైతన్య పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం అయితే పట్టణ ఓటర్లు.. పోలింగ్ బూత్‌లకు వస్తారని తెలిపారు. అదే వీకెండ్ సమయంలో పెడితే.. వెనుకంజ వేస్తారని తెలిపారు. అందుకోసమే వారం మధ్యలో ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. వీకెండ్‌లో పోలింగ్ ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. అందుకే వారం మధ్యలో ఎన్నికల సంఘం ఎంచుకుంది.
నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండగా.. జార్ఖండ్‌లో 2025, జనవరి 5తో కాలపరిమితి ముగుస్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉండగా.. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు. నవంబర్ 20న మహారాష్ట్ర, నవంబర్ 13, 20న జార్ఖండ్ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న వెలువడనున్నాయి.