MP High Court: ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది.
వివాహిత తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఒక వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 10న హైకోర్టులో విచారణకు వచ్చింది. సదరు వ్యక్తిపై ఉన్న అత్యాచారం కేసుని న్యాయమూర్తి కొట్టివేశారు. సదరు పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, తనను పెళ్లి చేసుకుంటాననే హామీ ఇచ్చినట్లు, దీని ఆధారంగానే అతడితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నట్లు వివాహిత పేర్కొంది.
Read Also: Vishvambhara : విశ్వంభర సినిమాలో ఆ పాటకు థియేటర్లలో బాక్స్ లు బద్దలు కావడం ఖాయం
ఫిర్యాదుదారు వివాహిత అయినప్పుడు, తప్పుడు వాగ్దానం సాకుతో శారీరక సంబంధానికి సమ్మతి ఇవ్వడం, ‘‘వాస్తవానికి దురాభిప్రాయంగా’’ పరిగణించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ, సదరు వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పటికే మహిళకి వేరే వ్యక్తితో పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మహిళ ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు, మహిళ ఒకే ఏరియాలో నివసించే వారు. మూడు నెలల స్నేహం తర్వాత వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చి, పెళ్లి చేసుకుంటానని నిందితుడు మొదట హామీ ఇచ్చాడు. ఆ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదని వెనక్కి తగ్గాడని ఆరోపించింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఫిర్యాదు చేసిన వివాహిత స్త్రీని బలవంతంగా ఒత్తిడి చేసి లైంగిక సంబంధంలోకి ప్రవేశించేలా చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో ఎలాంటి వివరాలు లేవని కోర్టు గుర్తించింది. ఫిర్యాదు స్వయంగా నేరం జరిగిందని సూచించలేదు కాబట్టి, ఇలాంటి ఎఫ్ఐఆర్‌లను తొలి లోనే తుంచేయాలని జస్టిస్ భట్టి అన్నారు.