ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని చంపింది తామేనంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్‌బుక్ మాధ్యమంగా ప్రకటించిన విషయం తెలిసిందే! కెనడాలో ఉంటున్న తాను.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయితో కలిసి అతని హత్యకు కుట్ర పన్నినట్టు వెల్లడించాడు. తమ సన్నిహితుల హత్యలో సిద్ధూ ప్రమేయం ఉందని తెలియడంతోనే తాము అతడ్ని అంతమొందించినట్లు గోల్డీ తెలిపాడు. దీంతో, ఆల్రెడీ పలు కేసుల్లో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు.
అయితే.. ఈ కేసులో తన ప్రమేయం లేదని, గోల్డీ బ్రార్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని లారెన్స్ ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు.. తనని కాపాడాలంటూ కోర్టును కోరాడు. విచారణ కోసం తనని పంజాబ్ పోలీసులకు అప్పగించొద్దని, ఒకవేళ అప్పగిస్తే తనను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపే అవకాశం ఉందని పటియాలా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. లారెన్స్ తరఫు న్యాయవాది సైతం.. ఇంతటి భారీ హత్య కుట్రను జైల్లో నుంచి ఎలా ప్లాన్ చేస్తారని ప్రశ్నించారు. గోల్డీ చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని న్యాయవాది ఖండించారు. దీంతో, ఈ కేసు మరింత చిక్కుముడిగా మారింది. లారెన్స్ ప్రమేయం లేనప్పుడు.. గోల్డీ బ్రార్ ఎందుకు అతనితో కలిసి సిద్ధూ హత్యకు కుట్ర పన్నామని ప్రకటన చేశాడు..?
ఇదిలావుండగా.. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న లారెన్స్, ఓ మాజీ విద్యార్థి నాయకుడు. లారెన్స్‌కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. వీళ్ళు పంజాబ్‌లో వసూళ్ళ దందాను నడుపుతుండేవారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణాల్లో కార్యకలాపాలు నిర్వహించిన లారెన్స్.. పలు కేసుల్లో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అటు, గోల్డీ బ్రార్ పోలీసులకు చిక్కకుండా కెనడాకు పారిపోయాడు. అక్కడి నుంచే అతడు తమ కార్యకలాపాల్ని పంజాబ్‌లో కొనసాగిస్తున్నట్టు సమాచారం.