Heavy rains in Kerala: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో గురువారం రోజు మొత్తం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.24 గంటల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షం కురిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ఆరెంజ్ అలర్ట్ లో 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా చాలక్కుడి, పంపా, మణిమాల, అచ్చంకోవిల్ వంటి నదులు ప్రమాద తీవ్రతను దాటి ప్రవహిస్తున్నాయి. త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ కోరారు.
Read Also: TSPSC : టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల
భారీ వర్షాల కారణంగా.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. గల్ఫ్ దేశాల నుంచి కేరళ కోజికోడ్ కు వచ్చే 5 విమానాలను కొచ్చిన్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. షార్జా, అబుదాబి, బహ్రెయిన్, దోహా నుంచి వస్తున్న విమానాలను కొచ్చిన్ కు మళ్లించారు. రాత్రి పూట కొండ ప్రాంతాల్లో ప్రయాణాలను చేయవద్దని అధికారులు సూచించారు. నదులు, సరస్సుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇడుక్కి, లోయర్ పెరియార్, కల్లార్ కుట్టి, ఎరట్టయార్, మూజియార్ డ్యాములకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు కేరళ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 18 మంది మరణించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.