Kerala: కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వరి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దక్షిణ జిల్లాలోని కట్టనాడ్ ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. వరి రైతు కేజీ ప్రసాద్ సూసైడ్ నోట్ రాసి.. తన ఆత్మహత్యకు రాష్ట్రప్రభుత్వం, కొన్ని బ్యాంకులు కారణమని ఆరోపించారు. ఈ ఆత్మహత్య కేరళలో పొలిటికల్ దుమారాన్ని రేపింది.
తిరువల్లలోని రైతు మృతదేహాన్ని ఉంచిన ఆస్పత్రిని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సందర్శించారు. ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు నెలల తరబడి బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Tula Uma: తుల ఉమ ఇంటికి క్యూ కడుతున్న నేతలు.. పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఆహ్వానం!
55 ఏళ్ల ప్రసాద్ అనే వరి రైతు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరువల్ల ఆస్పత్రికి తరలించి వైద్యం అందించినా.. ఈ రోజు తెల్లవారుజామున మరణించాడు. అయితే పోలీసులు మాత్రం ఏ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడనే వివరాలను వెల్లడించలేదు. వరి డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అతని సన్నిహితులు చెప్పారు. తన మృతికి కారణం ప్రభుత్వం, కొన్ని బ్యాంకులే అని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను వీడియో కాల్ చేశాడు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో బ్యాంకులు తనకు రుణాలను నిరాకరిస్తున్నాయని అతను ఆరోపించాడు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో సకాలంలో బ్యాంకు రుణాన్ని చెల్లించలేదని రైతు ఆరోపించాడు.
రైతు ఆత్మహత్యపై గవర్నర్ మాట్లాడుతూ.. రైతులు కష్టాల్లో జీవిస్తున్నారని.. ఈ విషయాన్ని పరిశీలించి, సమస్యను అధిగమించేందుకు ఏమి చేయాలో చూస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని.. సమస్య ఎక్కడ ఉందని రాష్ట్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వేడుకలకు ఖర్చు చేస్తున్నారని, పేద ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతు మరణానికి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర చీఫ్ కే. సురేంద్రన్ ప్రసాద్ ఆరోపించారు. అయితే వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రభుత్వం కారణం కాదని మరో మంత్రి జీఆర్ అనిల్ అన్నారు.