CM Vijayan: ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఎం, మిత్ర పక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, కేరళలోకి వచ్చే రెండు పార్టీల మధ్య మాత్రం విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సీరియస్ పొలిటీషియన్ కాదని అన్నారు. అంతకుముందు కేరళలో బీజేపీ, సీఎం విజయన్ చేతులు కలిపారని రాహుల్ – ప్రియాంకా గాంధీలు ఆరోపించిన నేపథ్యంలో కేరళ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
దేశంలో తీవ్రమైన రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ చాలా సార్లు గైర్హాజరయ్యారని సీఎం ఆరోపించారు. ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదన్నది దేశంలోని ప్రజలకు తెలుసు.. ఆయన వేరే పార్టీకి చెందిన వ్యక్తి కావడం, అది వారి అంతర్గత విషయం కావడంతో మేము పెద్దగా దీనిపై వ్యాఖ్యానించం మానుకున్నామని విజయన్ చెప్పారు. కానీ, సార్వత్రిక ఎన్నికల సమయంలో కేరళకు వచ్చి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు మద్దతుగా వ్యాఖ్యానించడం చాలా అపరిపక్వమైందని అన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర సంస్థలు ఎందుకు సీఎం విజయన్‌పై చర్యలు తీసుకోవడం లదేని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. అయితే, కేరళలో మొత్తం 20 స్థానాలు ఉంటే, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 15 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి బీజేపీ కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సీపీఎం, గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి కాంగ్రెస్‌ని ఓడించాలని అనుకుంటోంది.