Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమై 5 వాగ్ధానాల్లో ఒకటైన ‘గృహ లక్ష్మీ’ పథకాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ పథకాన్ని లాంచ్ చేయనుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళలకు ప్రతీ నెల రూ. 2000లను ప్రభుత్వం అందిస్తుంది.
ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘గృహలక్ష్మి’ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం రూ.17,500 కోట్లు కేటాయించింది.
READ ALSO: Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది. తిరుగులేని మెజారిటితో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అధికారంలోకి రావడానికి శక్తి, గృహ జ్యోతి, అన్న భాగ్య, గృహ లక్ష్మి, యువనిధి అనే 5 పథకాలు ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు అమలు కాబోతున్న గృహలక్ష్మీ పథకం నాలుగోది. 5వది నిరుద్యోగ భృతికి సంబంధించిన యువనిధి.
గృహలక్ష్మీ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జూలై 19న ప్రారంభించింది. అంత్యోదయ, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్), దారిద్రరేఖకు ఎగువన ఉండీ రేషన్ కార్డులు కలిగిన కుటుంబ పెద్దలైన మహిళలు గృహలక్ష్మీ పథకానికి అర్హులు. ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా సర్కార్ ప్రకటించింది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, భర్తలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే, జీఎస్టీ రిటర్న్‌లను ఫైల్ చేసిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు.