Karnataka Governor: కర్ణాటక ప్రభుత్వం- రాజ్‌భవన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతుంది. మే 2023 నుంచి లోకాయుక్తలో ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ కేసులపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సమాచారం కోరారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వంలోని అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త అభ్యర్థన మేరకు కన్నడ సర్కార్ మంజూరు చేసిన ప్రాసిక్యూషన్‌పై సెప్టెంబర్ 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్‌కు గవర్నర్ లేఖ రాశారు. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై విచారణకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని లేఖలో కోరారు.
Read Also: Womens T20 Worldcup 2024: భారీగా పెరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
కాగా, లోకాయుక్త ప్రాసిక్యూషన్‌లకు సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలపై సమగ్ర నివేదికను అందించాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలతో పాటు బిల్లులు ఆమోదం, సిఫార్సు చేసిన శిక్ష స్వభావంపై ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, తిరస్కరించబడిన ప్రతిపాదనలకు, వాటి నిర్ణయాల వెనుక గల కారణాలను పూర్తిగా వివరించాలని గవర్నర్ తెలిపారు. ఇక, థావర్‌చంద్ గెహ్లాట్ లేఖకు ప్రతిస్పందనగా సెప్టెంబర్ 10న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌లోని విజిలెన్స్ సెల్.. ప్రాసిక్యూషన్ ఆంక్షల కోసం లోకాయుక్త చేసిన అభ్యర్థనను “అత్యవసరంగా” అందించాలని అన్ని విభాగాలను కోరింది. వారంలోగా అన్ని వివరాలను అందజేయాలని అన్ని శాఖలను ఆదేశించింది.
Read Also: Tirumala Tickets: భక్తులకు అలర్ట్.. కాసేపట్లో డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు..
ఇక, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ మంత్రులు, బీజేపీ నేతలు సహా జనతాదళ్ (సెక్యులర్) నాయకులపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆగస్టు 17వ తేదీన గవర్నర్ అనుమతి ఇచ్చారు.