కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ప్రముఖ లాయర్, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు సమాజ్ వాదీ పార్టీ( ఎస్పీ) తరుపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ సమర్పించారు.
కబిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి మే 16నే రాజీనామా చేసినట్లు కపిల్ సిబల్ వెల్లడించారు. ఈ రోజు నామినేషన్ కు ముందు కపిల్ సిబల్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు కీలక నేత ఆజాంఖాన్ తో సమావేశం అయ్యారు. పార్లమెంట్ లో ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలని.. మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలతో కూటమి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం అని కపిల్ సిబల్ అన్నారు.
గత కొద్ది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ విధానాలు, నాయకత్వం, వరసగా ఓడిపోవడంపై కపిల్ సిబల్ గుర్రుగా ఉన్నారు. సీనియర్ నేతలతో కూడిని జీ 23 కూటమిలో భాగంగా ఉన్నారు. కాంగ్రెస్ విధానాలను జీ 23 నేతలు తీవ్రంగా విమర్శించారు. గెలవాలంటే పార్టీ నాయకత్వం, నిర్మాణంలో మార్పు రావాలని పలు మార్లు కపిల్ సిబల్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.ఇటీవల చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అంతా ఆశించినప్పటికీ ఇదేం జరగలేదు.
మన్మోహన్ మంత్రి వర్గంలో కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ గా, హ్యూమన్ డెవలప్ మెంట్ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ఇదిలా ఉంటే ఆజాంఖాన్ తో పాటు పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కపిల్ సిబల్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తు వచ్చేలా అఖిలేష్ తరుపున న్యాయస్థానంలో కపిల్ సిబల్ వాదించారు. ప్రస్తుతం కోర్ట్ కేసులతో నలిగిపోతున్న ఎస్పీ కీలక నేత ఆజాంఖాన్ కేసులను కూడా కపిల్ సిబలే వాదిస్తున్నారు.