మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు! దేశంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి. ముస్లిం దేశాలు సైతం ఈ వ్యవహారంపై మండిపడ్డాయి. అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అయితే.. దేశంలో కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని, ప్రవక్తపై కామెంట్స్ చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు.. నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసినా, ఆమెపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నుపుర్‌కి మద్దతుగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముందుకొచ్చింది.
ఈ తరహా వివాదాలు చెలరేగినప్పుడల్లా తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు కంగనా ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కూడా ముందుకొచ్చి, ఒక మహిళ చేసిన వ్యాఖ్యలపై దేశాన్నే ఇబ్బంది పెడుతున్నారంటూ కుండబద్దలు కొట్టింది. పీకే సినిమాలో శివుడి గెటప్‌లో ఉన్న ఓ వ్యక్తిని ఆమిర్ ఖాన్ వెంబడించే సన్నివేశానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘నేను హిందువుగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పేందుకు ఇది కూడా ఒక కారణం. ఇది శివుడ్ని కూడా బాధించదు. ఇలాంటివి తన ఆథ్యాత్మికతకు లేదా విశ్వాసానికి భంగం కలిగించవు’’ అని కంగనా ఫేస్‌బుక్ మాధ్యమంగా తెలిపింది. అంటే.. తమ దేవుళ్లని సినిమాల్లో హేళన చేస్తూ చూపించినా, అవి తమ అధ్యాత్మికతకు ఎలాంటి భంగం కలిగించవని కంగనా అభిప్రాయం అన్నమాట!
కాబట్టి.. ఓ మహిళ చేసిన వ్యాఖ్యలపై ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదని కంగనా రనౌత్ ఉచిత సలహా ఇస్తోంది. యావత్ దేశాన్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఓ ఎంపీ ‘నుపుర్‌కు మరణశిక్ష పడాల్సిందేనని’ చేసిన వీడియోని షేర్ చేస్తూ కౌంటర్లు పేల్చింది. తమ మతం శాంతియుతమైందని చెప్పే ఆ ఎంపీ, నుపుర్ చావాలని కోరుకుంటున్నాడని, ఎందుకంటే నుపుర్ వ్యాఖ్యలతో దేవుడు బాధపడ్డాడనని కారణం చెప్తున్నాడని తెలిపింది. ‘‘అసలు దేవుడు ఈ ఎంపీకి ఎలాంటి కాంటాక్ట్ అయ్యాడు చెప్మా?’’ అంటూ సెటైరిక్‌గా ప్రశ్న సంధించింది.