CM Hemanth Soren: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థ జారీ చేసిన రెండో సమన్‌ను దాటవేయడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, సీఎం హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలియజేసే లేఖను సోరెన్ ఈడీ కార్యాలయానికి ప్రత్యేక మెసెంజర్ ద్వారా పంపారు. భూకుంభకోణం కేసులో ఆగస్టు 14న తమ ముందు విచారణకు హాజరు కావాలని సోరెన్‌కు ఈ నెల 7న ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే ఆరోజున బిజీ షెడ్యూల్ ఉండటంతో తాను విచారణకు హాజరుకాలేనని ఆయన చెప్పారు. దాంతో ఈ నెల 24న విచారణకు రావాలని ఈడీ మరోసారి సమన్లు జారీచేసింది. 24న కూడా ఆయన ఈడీ విచారణకు హాజరు కాకుండా తాను సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నట్లు ఈడీ డైరెక్టర్‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి తెలియజేశారు.
Read Also: Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారు..! ఈటెల సంచలన వ్యాఖ్యలు..
తాను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని సోరెన్ వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లు జారీచేసిన విధానం చూస్తే తానేదో దేశం విడిచి పారిపోతున్నట్లు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈడీ సమన్లను రాజకీయ ప్రేరేపితమైనవని సీఎం విమర్శించారు. ఆగస్టు 7 న జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ED రాంచీ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. అయితే ఏజెన్సీ సీఎం ఆరోపణను తిరస్కరించడమే కాకుండా ఆగస్టు 24న తమ ముందు హాజరుకావాలని కోరుతూ సోరెన్‌కు రెండవసారి సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌తోపాటు మరో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హేమంత్ సోరెన్‌ను గతేడాది నవంబర్ 17న ఈడీ తొమ్మిది గంటలకుపైగా విచారించింది. ఇవే ఆరోపణలపై ఇప్పటికే ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్, ఇద్దరు వ్యాపారవేత్తలు కోల్‌కతాకు చెందిన అమిత్ అగర్వాల్, రాంచీలో షాపింగ్ మాల్స్‌ను కలిగి ఉన్న బిష్ణు అగర్వాల్‌తో సహా 13 మందిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.