Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మరణించారు. పూంచ్ జిల్లాకు చెందిన పోలీస్ తాహిర్ ఖాన్ వీర మరణం పొందారు. నిన్న రాత్రి కుల్గామ్ జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరిగింది.. తీవ్రంగా గాయపడ్డ తాహిర్ ఖాన్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.. అయితే అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించారు.
Read Also: Rajasthan: నీరు తాగినందుకు దళిత బాలుడిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి
ఇదే శనివారం రోజున శ్రీనగర్ లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే గురువారం రాజౌరీ జిల్లాలో మరోసారి యూరీ తరహా దాడికి ప్రయత్నించారు ఉగ్రవాదులు. రాజౌరీ జిల్లాలోని పర్గల్ ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు వీర మరణం పొందగా.. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ దాడికి ముందు బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇందులో కీలక ఉగ్రవాదిగా ఉన్న లతీఫ్ రాథర్ ను మట్టుపెట్టాయి. గతంలో కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను కాల్చి చంపిన ఘటనతో పాటు కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను చంపిన ఘటనలో లతీఫ్ రాథర్ కు సంబంధాలు ఉన్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఉగ్రదాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా దేశ రాజధాని హై అలెర్ట్ గా ఉంది. పదివేలకు పైగా పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.