Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు. ఆ సమయంలో కాశ్మీర్లోని హిందువులు పెద్ద ఎత్తున తమకు రక్షణ కల్పించాలని చెబుతూ ఆందోళనలు చేశారు.
ఇదిలా ఉంటే మరోసారి ముష్కరులు స్థానికేతరులే లక్ష్యంగా గ్రెనెడ్ దాడి చేశారు. పుల్వామా జిల్లాలోని గుదూరా ఏరియాలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో బీహార్ కు చెందిన ఓ కూలీ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన కూలీని బీహార్ కు చెందిన సక్వా పర్సా నివాసి మొహమ్మద్ ముంతాజ్ గా గుర్తించారు. గాయపడిన వారిలో బీహర్ కు చెందిన రాంపూర్ వాసులు మహ్మద్ ఆరిఫ్, మజ్బూల్ గా గుర్తించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
ఇటీవల కాలంలో కాశ్మీర్ లోని ఉగ్రవాదులను భద్రతా బలగాలు వేటాడి మట్టుపెడుతున్నాయి. దీంతోె తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాదులు అమాయకులైన స్థానికేతరులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పనుల కోసం వచ్చే కూలీలే వీరికి టార్గెట్ అవుతున్నారు. గతంలో రాహుల్ భట్ అనే పండిట్ ను చంపిన తరువాత వరసగా ఉగ్రవాదులు ఇలానే కాశ్మీర్ యాంకర్, హిందూ ఉపాధ్యాయురాలిని టార్గెట్ చేసి చంపారు. అయితే వీరిని చంపిన ఉగ్రవాదులను రోజుల వ్యవధిలోనే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అయితే గత కొన్నాళ్లుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రర్ గ్రూపులు కాశ్మీర్ లో క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్నాయి.